తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తే, ‘కాంగ్రెస్’కు మద్దతిస్తా: పవన్ కల్యాణ్ ఆఫర్

  • సీనియర్ నేత వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి
  • అలా చేస్తే ‘కాంగ్రెస్’ తరపున ప్రచారం చేస్తా
  • కాంగ్రెస్ నేతలందరిపైనా నాకు గౌరవం ఉంది
  • ఖమ్మంలో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ని తెలంగాణ సీఎం అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే, ఆ పార్టీకి తాను మద్దతిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు ఖమ్మం పర్యటనలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తే, ఆ పార్టీ తరపున నిలబడి ప్రచారం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరిపైనా తనకు గౌరవం ఉందని, అలాగే, వీహెచ్ పైనా ఉందని, ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు.

‘వీహెచ్ తో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. వీహెచ్..మీరు నాతో రండి. ఇంటింటికి తిరుగుదాం..ప్రజాసమస్యలను తెలుసుకుందాం’ అని పవన్ అన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. కాగా, తెలంగాణ  పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ పై వీహెచ్ విమర్శలు చేయడం విదితమే. పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’ కాదని, ‘భజనసేన’ అని ఆయన ఘాటుగా విమర్శించారు.
Go Back to Shorts
Pawan Kalyan
VH

More Telugu News