గజ్వేల్ ప్రజలు మళ్లీ గెలిపిస్తారు..ఎలాంటి సందేహం లేదు: సీఎం కేసీఆర్

  • గజ్వేల్ కి ఇప్పటివరకూ చేసింది కొంతే
  • వచ్చే ఐదేళ్లలో సొంతిల్లు లేకుండా ఏ వ్యక్తీ ఉండొద్దు
  • ప్రతిపల్లెకు తారురోడ్డు వేస్తాం
గజ్వేల్ ప్రజలు టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది. నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకూ చేసింది కొంతేనని, వచ్చే ఐదేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలో సొంతిల్లు లేకుండా ఏ వ్యక్తీ ఉండొద్దని, పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతివ్యక్తీ సొంతిల్లు నిర్మించుకోవాలని సూచించారు. ప్రతిపల్లెకు తారురోడ్డు వేస్తామని, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి గుంటకు సాగునీరందిస్తామని మరోసారి స్పష్టం చేశారు. వచ్చే వర్షా కాలం నాటికి కొండపోచమ్మ జలాశయాన్ని నింపుతామని, తొలి దశలో చెరువులను నింపుతామని, గజ్వేల్ లో మూడు పంటలు పండించే స్థాయికి రైతులు ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, మొదటి దశలో గజ్వేల్ నియోజకవర్గానికి తీసుకొస్తామని, పంట కాలనీలు కూడా మొదట గజ్వేల్ లోనే రావాలని అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత రెండేళ్లలో సొంతిల్లు లేని కుటుంబం లేకుండా చేస్తామని, గజ్వేల్ లో ప్రతి ఇంటికీ వంద శాతం రాయితీతో రెండు పాడిపశువులు ఇస్తామని ఈ  సందర్భంగా హామీ ఇచ్చారు. తాను తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో చాలా మటుకు ఈ వ్యవసాయ క్షేత్రంలో పుట్టినవేనని, కంటి వెలుగు పథకానికి ఎర్రవల్లిలోనే నాంది పడిందని అన్నారు.
Go Back to Shorts
kcr
gajvel
erravalli

More Telugu News