తీసుకున్న అప్పు చెల్లించమని అడిగితే అసభ్య ప్రవర్తన.. మనస్తాపంతో గృహిణి ఆత్మహత్య

  • హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఘటన
  • రెండు నెలల్లో ఇచ్చేస్తానని రూ.9 లక్షలు తీసుకున్న నిందితుడు
  • డబ్బులు అడగడంతో ఇంటికొచ్చి అసభ్యకరంగా దూషించిన వైనం
అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇమ్మన్న పాపానికి అసభ్యంగా మాట్లాడడంతో తట్టుకోలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన మేడికొండ పృథ్వీగణేశ్‌-కృష్ణవేణి(31) భార్యాభర్తలు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తున్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లైన వీరికి ఓ పాప ఉంది.

జగ్గయ్యపేటకు చెందిన వేల్పుల సతీశ్ 8 నెలల క్రితం వీరి నుంచి రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలల్లోనే తిరిగి ఇచ్చేస్తానన్న సతీశ్ నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఆదివారం సాయంత్రం స్నేహితుడితో కలిసి దంపతులు ఇద్దరు సతీశ్ వద్దకు వెళ్లి  తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీశ్ వారిని చూసి పెద్దగా అరుస్తూ నానా రభస చేశాడు. దీంతో మరోసారి అడగొచ్చన్న ఉద్దేశంతో పృథ్వీ దంపతులు ఇంటికొచ్చేశారు. అయితే, రాత్రి 8:30 గంటల సమయంలో పృథ్వీ ఇంటికి వచ్చిన సతీశ్. కృష్ణవేణిని అసభ్యంగా దూషిస్తూ దాడికి దిగాడు. అంతేకాదు, పృథ్వీ సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు.

దీంతో మనస్తాపం చెందిన కృష్ణవేణి సోమవారం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పృథ్వీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సతీశ్ కోసం గాలిస్తున్నారు.  
Go Back to Shorts
Hyderabad
KPHB
West Godavari District
Loan

More Telugu News