చెప్పినట్లే చేస్తోన్న ట్రంప్.. డబ్ల్యూహెచ్‌వో నుంచి నిష్క్రమణ ప్రక్రియ షురూ

  Trump moves to pull US out of World Health Organization
  • ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వోకు నిధుల నిలిపివేత
  • ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని ఐరాసకు తెలిపిన అమెరికా
  • అమెరికా కాంగ్రెస్‌కు కూడా నోటిఫై 
  • ప్ర‌క్రియ‌ పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టే ఛాన్స్
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై మండిపడుతున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆ సంస్థకు నిధులు ఆపేసిన విషయం తెలిసిందే. చైనాలో పుట్టిన ఆ వైరస్‌ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌వో జాప్యం చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా, ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని కూడా ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అమెరికాలో ప్రక్రియ ప్రారంభమైంది. డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతామని ఐక్య‌రాజ్య‌స‌మితితో పాటు అమెరికా కాంగ్రెస్‌కు ఆయన తెలిపారు.

ఆ సంస్థ నుంచి త‌ప్పుకునేందుకు అమెరికా త‌మ‌కు నోటిఫై చేసిందని సంబంధిత అధికారి స్టిఫేన్ డుజారిక్ చెప్పారు. అయితే, ఈ ప్ర‌క్రియ‌ మొత్తం పూర్తి కావడానికి ఏడాది సమయం ప‌ట్ట‌నుం‌ది.

ఈ ప్ర‌క్రియ వచ్చే ఏడాది జూలై 6 వ‌ర‌కు కొనసాగనున్నట్లు సమాచారం. ఆ సంస్థ నుంచి అమెరికా త‌ప్పుకుంటున్న‌ట్లు త‌మ‌కు కూడా లేఖ అందిందని ఫారిన్ రిలేష‌న్స్ క‌మిటీ డెమోక్రాట్ సేనేట‌ర్ రాబ‌ర్ట్ మెనెన్‌డేజ్ కూడా చెప్పారు. అయితే, ఈ విషయంపై అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ మాత్రం మరోలా స్పందించారు. తాను అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌డితే డ‌బ్ల్యూహెచ్‌వోతో మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేస్తామని తెలిపారు.
Go Back to Shorts
WHO
Donald Trump
america

More Telugu News