ఎంపీ అర్వింద్, ఆయన తల్లిని పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy visits MP Aravind house
  • ఎంపీ అర్వింద్ నివాసంపై దాడి
  • టీఆర్ఎస్ నేతలపై మండిపడిన కిషన్ రెడ్డి
  • తీవ్ర నిరాశకు గురై దాడుల చేస్తున్నారని విమర్శలు
  • కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ఉద్దేశం లేదని వెల్లడి
బీజేపీ యువ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై ఇవాళ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అర్వింద్ ను, ఆయన తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

రాష్ట్ర రాజధానిలో రాజకీయ నేతలు, ప్రముఖులు నివసించే ప్రాంతంలోనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరాశలో ఉండడం వల్లే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓడిపోతామన్న భయం, సీఎం పీఠం కోల్పోతామన్న భయంతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 

కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని తాము ఎప్పుడూ భావించలేదని, కవితను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నామని కేసీఆర్ అనడం అర్థరహితమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నవారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. వివిధ పార్టీల్లో గెలిచిన వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది కేసీఆరేనని, వారితో రాజీనామాలు కూడా చేయించలేదని అన్నారు.
Go Back to Shorts
Kishan Reddy
Arvind
MP
BJP
TRS
Telangana

More Telugu News