ప్రియుడిని నమ్ముకుని భర్తకు విడాకులిచ్చేసిన హైదరాబాద్ యువతికి భారీ షాక్

Hyderabadi woman duped by lover on the pretext of marriage
  • ఇన్‌స్టాలో యువకుడితో హైదరాబాద్ యువతి ప్రేమ
  • దుబాయ్ సంబంధం చూసి యువతికి పెళ్లి చేసిన కుటుంబసభ్యులు
  • భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్‌కు వచ్చేయాలన్న ప్రియుడు
  • ప్రియుడు చెప్పినట్టే చేసి మోసపోయిన యువతి
ప్రియుడు చెప్పాడని దుబాయ్‌లో భర్తకు విడాకులిచ్చి  హైదరాబాద్ వచ్చేసిన ఓ యువతికి భారీ షాక్ తగిలింది. ఆమెతో కొన్నాళ్లు సహజీవనం చేసిన ప్రియుడు చివరకు మరొకరితో పెళ్లికి రెడీ అయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ రాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి(27) టెలీకాలర్‌గా పనిచేస్తోంది. సుమారు ఐదేళ్ల క్రితం ఆమెకు ఇన్‌స్టాలో సైఫ్(28) పరిచయమయ్యాడు. అతడిది మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా. సైఫ్‌తో యువతి పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో నగరానికి వచ్చిన సైఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. 

ఇదిలా ఉంటే.. 2020లో యువతి కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేసి దుబాయి పంపించేశారు. అయితే.. భర్తకు విడాకులిచ్చి ఇండియాకు వచ్చేస్తే పెళ్లి చేసుకుంటానని సైఫ్ బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. దీంతో.. ప్రియుడు చెప్పినట్టే చేసి ఆమె నగరానికి వచ్చేసింది. 

ఈ క్రమంలో బాధితురాలికి గర్భస్రావం కూడా చేయించిన సైఫ్ ఆమెతో కొంతకాలం కలిసున్నాడు. ఆ తరువాత తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈ నెల 22న మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సైఫ్ సిద్దమయ్యాడని గుర్తించిన యువతి అక్కడికెళ్లి అతడిని నిలదీసింది. కానీ..సైఫ్‌తో పాటూ అతడి కుటుంబసభ్యులూ ఆమెను తిరస్కరించడంతో చివరకు నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Hyderabad

More Telugu News