నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహాన్ని రూపొందించండి: సీఎం కేసీఆర్ ఆదేశం

నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహాన్ని రూపొందించండి: సీఎం కేసీఆర్ ఆదేశం
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని సీఎం అన్నారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

‘‘కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వైరస్ వచ్చిన వారికి ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందాలి. కాంటాక్ట్ వ్యక్తుల పరీక్షలు జరగాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధనలు పాటించాలి. ఇప్పటికే అన్ని రకాల పరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. వైద్య పరంగా అత్యుత్తమంగా స్పందిస్తాం. అందులో సందేహం లేదు’’ అని సీఎం అన్నారు.

‘‘కరోనాతో పోరాడుకుంటూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపులను ఎలా అమలు చేయాలి? ఏ జోన్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? దేన్ని అనుమతించాలి? దేన్ని అనుమతించకూడదు? హైదరాబాద్ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి? ఇతర జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఏయే రంగానికి ఏ సడలింపులు ఇవ్వాలి? ఏ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి?’’ తదితర అంశాల్లో అధికారులు లోతుగా ఆలోచించి, ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
KCR
TRS
Telangana
Corona Virus

Watch Today's Deals on Amazon

More Press News