చిరంజీవితో ఉన్న వివాదంపై తమ్మారెడ్డి స్పందన!

  • చిరంజీవితో నాకు పడదని అందరూ అనుకుంటారు
  • నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తొలి వ్యక్తి చిరంజీవే
  • ప్రేమతోనే నేను ఒక్కోసారి పరుషంగా మాట్లాడతా
తన ఆత్మీయులతో కలసి సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిన్న పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టినరోజును జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. తనకు పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని మిత్రులు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారని... అయితే, తానే తప్పించుకు తిరుగుతుంటానని తెలిపారు.

గత సంవత్సరం తన పుట్టినరోజు అయిన రెండు రోజులకు తన కుటుంబంలో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుందని... ఆ బాధనుంచి బయటపడేందుకే నావాళ్లు అనుకునే వారి మధ్య ఈ పుట్టిన రోజును జరుపుకున్నానని చెప్పారు. తన జీవితంలో ఇండస్ట్రీ తప్ప మరెవరూ లేరని... రాజకీయ నేతలు కూడా తనతో మంచిగా మాట్లాడతారని, కానీ తనకు ఇండస్ట్రీనే ప్రపంచమని అన్నారు.

చిరంజీవితో తనకు పడదని చాలా మంది అనుకుంటుంటారని... ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని భావిస్తుంటారని, అయితే అదంతా అవాస్తవమని తమ్మారెడ్డి తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ ఫోన్ కాల్ చిరంజీవి దగ్గర నుంచే వచ్చిందని, తనకు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ఆయన కాల్ చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. ఇండస్ట్రీలో తనకు శత్రువులు ఎవరూ లేరని... తాను పరుషంతో మాట్లాడినా అది ప్రేమతోనే అని, ద్వేషంతో తాను ఎన్నడూ మాట్లాడనని తెలిపారు. ఏదైనా ప్రేమతోనే జయించగలమనేది తన నమ్మకమని చెప్పారు.

తన కంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన వారు తనకన్నా పైస్థాయికి చేరితే ఆనందించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తానని తమ్మారెడ్డి చెప్పారు. ఎదుటివారు బాగుండాలనే కోరికతోనే ఒక్కొక్కసారి పరుషంగా మాట్లాడతానని తెలిపారు. తన మాటలకు కొందరు తిట్టుకున్నారని, మరి కొందరు మాట్లాడటం కూడా మానేశారని చెప్పారు. ఆ తర్వాత అందరూ మళ్లీ తన వద్దకు వచ్చారని, ఎప్పటికీ అందరూ తనతోనే ఉంటారని అన్నారు. 

chiranjeevi
tammareddy
birthday

More Telugu News