నేను ఎల్ఎల్ బీ చదివా, మా చెల్లి ఎంబీబీఎస్, పవన్ కల్యాణ్ ఐటీలో డిగ్రీ అందుకున్నారు: నాగబాబు

  • అన్నయ్య డిగ్రీ చదివారు
  • మా నాన్న చదవమని ఒత్తిడి చేయలేదు
  • ఒత్తిడి లేదు కాబట్టే నచ్చిన కోర్సులు చదివాం
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత కొందరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ఘాటుగా స్పందించారు. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న కారణంగానే ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యల బాట పడుతున్నారని అన్నారు. ఫెయిలైనవాడు ఎందుకూ పనికిరాడంటూ ఓ పరమచెత్త పరిస్థితి సృష్టిస్తున్నారని, పిల్లలు ఆ ఒత్తిడికే బలవుతున్నారంటూ మండిపడ్డారు. తమ కుటుంబంలో అలాంటి పరిస్థితి లేదని నాగబాబు గర్వంగా చెప్పారు.

"మా నాన్న అది చదవమని. ఇది చదవమని ఏనాడూ ఎవరినీ ఒత్తిడి చేయలేదు. బాగా చదువుతున్నారా? లేదా? అని మాత్రమే మా అమ్మ అడుగుతుండేది. ఫలానా చదువే చదవాలని వాళ్లెప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అందుకే అన్నయ్య డిగ్రీ చదివారు. నేను నాకెంతో ఇష్టమైన ఎల్ఎల్ బీ చదివాను. మా ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు ఎంబీబీస్, మరొకరు గ్రాడ్యుయేషన్ చేశారు. ఇక, పవన్ కల్యాణ్ ఇంటర్ తర్వాత ఐటీ డిగ్రీ చేశాడు" అంటూ వివరించారు.

అంతేగాకుండా, తమ ఇంట్లో ఎంత ఆహ్లాదకర వాతావరణం ఉండేదో నాగబాబు ఒక సంఘటనతో వివరించే ప్రయత్నం చేశారు. "పదో తరగతిలో మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతో ఫెయిల్ అవుతానని భయం పట్టుకుంది. అదే విషయం మా నాన్నతో చెబితే, పాసైతే రూ.100 ఇస్తాను, ఫెయిలైతే రూ.500 ఇస్తాను అని చెప్పారు. రిజల్ట్ గురించి టెన్షన్ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అని ఆయన తన మాటలతో చెప్పారు" అని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక పరమైన బోధ చేయాలే తప్ప, ఒత్తిడికి లోను చేసేవిధంగా ప్రవర్తించరాదని నాగబాబు హితవు పలికారు.
Go Back to Shorts
Nagababu

More Telugu News