వైట్నర్ మత్తులో వీరంగమేసిన మహిళలు.. బాలిక కిడ్నాప్!

  • హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో ఘటన
  • బాధితురాలిపై పోలీసుల సమక్షంలోనే దాడి
  • లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చెప్పులు
వైట్నర్ కిక్కెక్కిన మహిళలు వీరంగమేశారు. పోలీసుల ఎదుట ఓ మహిళను కొట్టడంతోపాటు అడ్డుకునేందుకు వచ్చిన మహిళలపై చెప్పులు విసిరారు. హైదారాబాద్‌లోని ఫలక్‌నుమాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..  మదన్‌ఖాన్‌ మల్గీ ప్రాంతానికి చెందిన షబానా(32), పర్వీన్‌(30), అయేషా(30), జబీన్‌(31)లు శనివారం సాయంత్రం ఫాతిమానగర్‌కు చెందిన గోరీబీ(50) ఇంటికి వెళ్లారు. అప్పటికే వైట్నర్ మత్తులో ఉన్న వారందరూ కలిసి గోరీబీ కుమార్తె విషయమై ఆమెతో గొడవపడి చేయి చేసుకున్నారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. అక్కడితో ఆగక ఆమె చిన్న కుమార్తె  సబాబేగం(13)ను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు.

దీంతో గోరీబీ నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఓ ఇంట్లో బందీగా ఉన్న సబాబేగంను విడిపించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గోరీబీని చూసి రెచ్చిపోయిన నిందితులు పోలీసుల ఎదుటే ఆమెపై దాడికి దిగారు. నోటికి వచ్చినట్టు తిడుతూ కొడుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన మహిళలు పోలీసులపైకి చెప్పులు విసిరారు. మహిళపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Falaknuma
Telangana
Old city
women

More Telugu News