తిరుమలలో బయటపడ్డ భద్రతా వైఫల్యం.. గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లిన భక్తుడు

  • ఆనంద నిలయాన్ని మొబైల్ లో వీడియో తీసిన భక్తుడు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • అధికారులపై మండిపడుతున్న భక్తులు
  • విచారణ ప్రారంభించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో మరోమారు భద్రతా వైఫల్యం బయటపడింది. ఆదివారం రాత్రి ఓ భక్తుడు ఆనంద నిలయం వరకూ మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లాడు. గర్భగుడిని బయటి నుంచి సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. ఓ భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.

శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ ను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇతరత్రా లగేజీని కూడా అనుమతించరు. పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే, ఆదివారం ఓ భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళ్లాడు. ఆనంద నిలయాన్ని బయటి నుంచి వీడియో తీశాడు. విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలతో పాటు గర్భగుడి కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుమల విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ సదరు భక్తుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Tirumala
ananda nilayam
temple video
mobile phone
security lapse

More Telugu News