ఢిల్లీ మెట్రోలో చితక్కొట్టేసుకున్న ప్రయాణికులు.. వీడియో ఇదిగో!

  • తరచూ వార్తల్లోకి ఢిల్లీ మెట్రో
  • బూతులు తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్న యువకులు
  • ఢిల్లీ మెట్రోలో కావాల్సినంత వినోదం లభిస్తోందంటున్న నెటిజన్లు
  • ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలన్న ఢిల్లీ మెట్రో
ఢిల్లీ మెట్రో ఇటీవల తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. రైలులో అసభ్యకర చేష్టలు.. ముద్దుసీన్లు, డ్యాన్సింగ్ రీల్స్‌తో తరచూ దర్శనమిస్తున్నాయి. ఇలాంటివి కూడవని, చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా వీటికి అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా సోషల్ మీడియాకెక్కిన ఓ వీడియో మరింత సంచలనమైంది. నిల్చోవడానికి కూడా చోటులేని రైలులో ఇద్దరు యువకులు ఫైటింగ్‌కు దిగారు. బూతులు తిట్టుకుంటూ ఎగబడి ఇరగకుమ్మేసుకున్నారు. దీంతో ఇతర ప్రయాణికులు వారికి దూరంగా జరిగారు. మరికొందరు మాత్రం వారిని విడదీసే ప్రయత్నం చేశారు. యువకులు ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే, వీరి గొడవకు కారణమేంటన్నది తెలియరాలేదు.

వీడియో బయటకు వచ్చాక డిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు బాధ్యతగా మెలగాలని సూచించింది. రైలులో ఇలాంటివి ఎవరైనా చూస్తే వెంటనే డీఎంఆర్‌సీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. ఘటన ఎక్కడ జరిగింది.. ఏ సమయంలో జరిగింది.. ఏ కారిడార్‌లో జరిగింది అన్న వివరాలు చెబితే చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. 

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘ప్రశాంతంగా ఉండండి.. జీవితంలో ఏమైనా తక్కువ సమస్యలు ఉన్నాయా?’ అని ఒకరంటే, ఢిల్లీ మెట్రోలో అన్ని వయసుల వారికి కావాల్సినంత వినోదం లభిస్తోందని మరొకరు కామెంట్ చేశారు.

Delhi Metro
DMRC
Passengers Fight

More Telugu News