తారకరామా నగర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

  • ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యత బాగోలేదన్న ఆరోపణలు
  • మైలవరం పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
  • మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరా
  • విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలన
  • ఇప్పటికే హెడ్ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేసిన మంత్రి
  • భవిష్యత్తులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మధ్యాహ్న భోజనం నాణ్యత బాగోలేదన్న ఆరోపణల నేపథ్యంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

మంగళవారం నాడు మైలవరంలోని తారకరామా నగర్ మండల పరిషత్ పాఠశాలకు లోకేశ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు. "భోజనం ఎలా ఉంది? రోజూ ఇలాగే ఉంటుందా లేక ఈ ఒక్కరోజే బాగుందా?" అని విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ అడిగారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పడంతో, వారితోపాటే కూర్చుని మంత్రి భోజనం చేశారు.

ఇటీవల ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పుడే స్పందించిన మంత్రి.. బాధ్యులైన హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, వంట ఏజెన్సీని కూడా తొలగించారు. భవిష్యత్తులో విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

పాఠశాల స్థితిగతులపై ఎంఈవో, హెడ్‌మాస్టర్‌తో సమీక్ష నిర్వహించారు. అనంతరం, నారా లోకేశ్ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. 

మంత్రి పర్యటన గురించి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహా ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేకపోవడంతో, విషయం తెలిసి వారంతా హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు.

Nara Lokesh
Tarakarama Nagar School
Mylavaram
Midday Meal Scheme
Andhra Pradesh Education
Government School Inspection
Vasanta Krishna Prasad
NTR District
School Food Quality
Anganwadi Center

More Telugu News