దేవుడే మనిషిని సాయం కోరితే.. ఓటీటీలో మలయాళం మూవీ

  • ఫాంటసీ టచ్ తో సాగే కంటెంట్ 
  • క్రితం ఏడాది థియేటర్లలో విడుదల 
  • ఈ నెల 20వ తేదీ నుంచి 'మనోరమా మ్యాక్స్'లో 

కష్టాలు ఎదురైనప్పుడు .. బాధలు పడుతున్నప్పుడు ఎవరికైనా గుర్తొచ్చేది దేవుడే. ఎవరికివారు దేవుడికి తమ సమస్యలను చెప్పుకుని, ఆ గండాల నుంచి గట్టెక్కించమని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ దేవుడే దిగివచ్చి .. మనలో ఒకరిని వెతుక్కుంటూ వచ్చి ఒక సాయం చేయమని కోరితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన సాధారణంగా ఎవరికీ రాదు. ఎందుకంటే దేవుడు తలచుకుంటే తీరని కష్టం లేదు .. దాటని సమస్య లేదు అనే చాలామంది అనుకుంటూ ఉంటారు. 

అందరికీ సాయం చేసే దేవుడు, తనకి సాయపడమని ఒక మనిషిని కోరడమనే ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్'. సైజూ కురుప్ - సన్నీ వేన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఫెబీ జార్జ్ దర్శకత్వం వహించాడు. థామస్ జోస్ నిర్మించిన ఈ  సినిమా, క్రితం ఏడాది జూన్ 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. కొన్ని కారణాల వలన కాస్త ఆలస్యంగా ఈ సినిమా 'మనోరమా మ్యాక్స్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సినిమాలో కథానాయకుడు తన కెరియర్  విషయంలో చాలా అసంతృప్తితో ఉంటాడు. అతని వైవాహిక జీవితం కూడా సమస్యల్లో ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అతనికి మనిషి రూపంలోని దేవుడు ఎదురవుతాడు. సమస్యల్లో ఉన్న మనిషిని దేవుడే ఓ సాయం అడుగుతాడు. ఆ సాయం ఏమిటి? అది విన్న కథానాయకుడు ఎలా స్పందిస్తాడు? అప్పటి నుంచి అతని జీవితం ఎలా మారిపోయింది? అనేది కథ. 



Siju Kurup
Malayalam movie
OTT release
Returned and Directed by God
Sunny Wayne
Manorama Max
Feby George
Thomas Jose
God asks for help

More Telugu News