ఈసారి ఐపీఎల్ విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే!

  • ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందన్న డివిలియర్స్
  • ఈసారి భారం మొత్తం కోహ్లీ ఒక్కడి పైనే ఉండదని వ్యాఖ్య
  • ఆర్సీబీ ఈ సీజన్‌లో దుమ్ము రేపడం ఖాయమన్న దక్షిణాఫ్రికా దిగ్గజం

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ పోరు ప్రారంభం కానున్న నేపథ్యంలో, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లోనూ ట్రోఫీని ముద్దాడి వరుసగా రెండోసారి విజేతగా నిలుస్తుందని ఆయన జోస్యం చెప్పాడు.


జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ, "ఈసారి భారం మొత్తం కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే ఉండదు. ఆర్సీబీ జట్టులో గెలవాలనే కసి ఉన్న పోరాట యోధులు చాలా మంది ఉన్నారు. జట్టు కూర్పులో పెద్దగా మార్పులు లేకపోవడం వారికి కలిసొచ్చే అంశం. సమష్టి కృషితో మరోసారి విజేతలుగా నిలిచే సత్తా ఈ జట్టుకు ఉంది" అని డివిలియర్స్ విశ్లేషించాడు.


విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ తరచుగా చెప్పే మాటలను ఏబీ పంచుకున్నాడు. "మనం ఒక్కసారి కప్పు గెలిస్తే చాలు... ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు ఇలా వరుసగా ట్రోఫీలు గెలుస్తాం అని విరాట్ ఎప్పుడూ చెబుతుండేవాడు. నేను దాన్ని గట్టిగా నమ్ముతున్నాను. ఆర్సీబీ ఈ సీజన్‌లో దుమ్ము రేపడం ఖాయం. వరుస విజయాలతో ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తుంది" అని నమ్మకంగా చెప్పాడు.


కేవలం సీనియర్లే కాకుండా, ఈ సీజన్‌లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగుతున్న యువ ఆటగాళ్ల ప్రతిభను కూడా ఏబీ కొనియాడాడు. వారి మెరుపులు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాయని పేర్కొన్నాడు.


AB de Villiers
IPL
Royal Challengers Bangalore
RCB
Virat Kohli
IPL Prediction
Cricket
T20 Cricket
Indian Premier League
RCB win

More Telugu News