కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయి: చిరంజీవి

  • గద్దర్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న చిరంజీవి
  • తెలంగాణ తరహాలో ఏపీలోనూ సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని విజ్ఞప్తి
  • సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలని కోరిన మెగాస్టార్
తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీలో కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ లో ఉగాది సందర్భంగా నిన్న 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025' ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అవార్డు స్వీకరించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని నానుడి ఉందని, దీనిని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగిపోయిన అవార్డులను పునరుద్ధరించి కళాకారులను గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) కళాకారుల పట్ల, సినిమాల పట్ల ఉత్సాహపరిచే విధానంలో కాస్త వెనుకంజ వేసిందని అనుకుంటున్నాను. సినిమాలకు దగ్గరగా ఉండే సీఎం చంద్రబాబు గారు దీన్ని ప్రేరణగా తీసుకొని మరింత ప్రోత్సహించాలి. తద్వారా రాష్ట్రానికి రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఈ ఆలోచన చేయాలని ఈ వేదిక నుంచి విన్నవిస్తున్నాను’ అని చిరంజీవి అన్నారు.

Chiranjeevi
Andhra Pradesh
Chandrababu Naidu
Telugu cinema
Telangana
Revanth Reddy
NTR National Award
Tollywood
Film industry
Movie revenue

More Telugu News