కనిపించిన నెలవంక... రేపు రంజాన్: శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

  • నెలవంక కనిపించడంతో రేపు సెలవుదినం
  • ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
  • లౌకికవాదానికి, మతసామరస్యానికి రంజాన్ ప్రతీక అన్న ముఖ్యమంత్రి
భారత్‌లో ఈరోజు నెలవంక కనిపించింది. దీనితో దేశవ్యాప్తంగా ముస్లింలు రేపు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిశాయి. దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు.

వాస్తవానికి శుక్రవారమే రంజాన్ ఉంటుందని తొలుత భావించారు. కానీ ముందురోజు నెలవంక కనిపించకపోవడంతో ఆయా ప్రభుత్వాలు నేడు సాధారణ పని దినంగా ప్రకటించాయి. ఇప్పుడు నెలవంక కనిపించడంతో ప్రభుత్వాలు రేపు సెలవు దినం ప్రకటించాయి. శనివారం రంజాన్ సెలవు, ఆదివారం సాధారణ సెలవు కావడంతో రెండురోజులు విరామం వచ్చింది.

రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరసోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేసిన కఠోర ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం వచ్చే ఈ ఆనందకరమైన పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

లౌకికవాదానికి, మతసామరస్యానికి రంజాన్ గొప్ప ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర మాసంలో ముస్లింలు అత్యంత కఠినంగా ఆచరించే ఉపవాసాలు, దేవుడిపై భక్తితో క్రమశిక్షణతో కూడిన ప్రార్థనలు సకల మానవాళికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గంగా-జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని పేర్కొన్నారు. మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. మానవాళికి శాంతి సందేశాన్ని అందించే రంజాన్ మాసం సర్వమత సమ్మేళనానికి వేదికగా మారుతుందని అన్నారు.

Revanth Reddy
Ramzan
Eid ul-Fitr
Telangana
Muslim festival
Ramadan
Islamic holiday

More Telugu News