ఇరాన్ చమురు అమ్మకాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ధరల నియంత్రణకు కొత్త వ్యూహం!

  • ఇరాన్‌పై ఆంక్షలను తాత్కాలికంగా సడలించిన అమెరికా 
  • సముద్రంలో ఉన్న 14 కోట్ల బ్యారెళ్ల చమురు అమ్మకాలకు అనుమతి 
  • గ్లోబల్ ధరల నియంత్రణకే ఈ నిర్ణయమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ వెల్ల‌డి
  • ఇరాన్ చమురునే ఆ దేశానికి వ్యతిరేకంగా వాడుతున్నామని వ్యాఖ్యలు
  • అయితే ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేసిన అమెరికా
ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఇంధన మార్కెట్లపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు, సముద్రంలో ఇప్పటికే రవాణా అవుతున్న ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల పాటు తాత్కాలికంగా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ద్వారా ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలను స్థిరీకరించాలని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ నెల‌ 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య నౌకల్లోకి ఎక్కించిన ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన లైసెన్స్‌లో స్పష్టం చేసింది. కొత్తగా చమురు ఉత్పత్తి చేయడానికి గానీ, కొనుగోలు చేయడానికి గానీ ఈ వెసులుబాటు వర్తించదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో సుమారు 14 కోట్ల బ్యారెళ్ల చమురు ప్రపంచ మార్కెట్లకు అందుబాటులోకి వస్తుందని బెస్సెంట్ వివరించారు.

ఇరాన్‌తో కొనసాగుతున్న "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలను అధిగమించేందుకే ఈ చర్య తీసుకున్నామని ఆయన తెలిపారు. "ధరలను అదుపులో ఉంచేందుకు మేము ఇరాన్ బ్యారెళ్లనే టెహ్రాన్‌కు వ్యతిరేకంగా వాడుతున్నాం" అని బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అదే సమయంలో ఈ వెసులుబాటును అలుసుగా తీసుకోవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరాన్ పొందడం కష్టతరం చేస్తామని, ఆ దేశంపై ఒత్తిడి విధానం యథాతథంగా కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచ ఉగ్రవాదానికి ఇరాన్ కేంద్రంగా మారిందని ఆరోపించిన బెస్సెంట్, ఆంక్షల పరిధిలోని ఇరాన్ చమురును చైనా చౌకగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటోందని విమర్శించారు.

ఇటీవలి వారాల్లో రష్యా చమురు విషయంలోనూ ఇలాంటి సడలింపులు ఇచ్చిన అమెరికా, తాజా నిర్ణయంతో మార్కెట్లను స్థిరీకరించే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు సైనిక, ఆర్థిక ఒత్తిడి కొనసాగిస్తూనే, మరోవైపు వ్యూహాత్మక జలసంధి అయిన హ‌ర్మూజ్ గుండా ఇంధన సరఫరాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నది అమెరికా ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రపంచానికి ఇంధన సరఫరాను పెంచేందుకు అమెరికా తన ఆర్థిక, సైనిక శక్తిని వినియోగిస్తూనే ఉంటుందని బెస్సెంట్ స్పష్టం చేశారు.

Iran Oil
US Treasury
Scott Bessent
Oil Prices
Global Energy Market
Operation Epic Fury
Hormuz Strait
Oil Sanctions
China Oil Imports

More Telugu News