అమరావతిలో నివసించే వారు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు: సీఎం చంద్రబాబు

  • గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో సౌత్ ఏషియా లెర్నింగ్ మీట్
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటును 15 శాతానికి చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
  • హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే అమరావతిని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటన 
  • గతంలో తన కృషి వల్లే హైదరాబాద్‌కు ఐటీ, జీనోమ్ వ్యాలీ వచ్చాయని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటును 15 శాతానికి చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో జరిగిన 'సౌత్ ఏషియా లెర్నింగ్ మీట్'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా, అమరావతిని ప్రపంచంలోనే ఓ అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని, అక్కడ నివసించే వారు మిగతా వారికంటే 20 ఏళ్లు ఎక్కువ జీవించేలా అత్యుత్తమ వాతావరణం కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఏపీ రాజధానిలో జీవన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండేలా చూస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి తాను చేసిన కృషిని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. "1990లలో ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ఎంతో శ్రమించాను. ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రం పెట్టాలని కోరాను. నాటి ప్రధాని వాజ్‌పేయితో చర్చించి టెలికాం సంస్కరణలు తీసుకువచ్చాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 5 వేల ఎకరాలు సేకరించాం. ట్రిపుల్ ఐటీ, నల్సార్, జీనోమ్ వ్యాలీ వంటివి నా కృషితోనే సాధ్యమయ్యాయి" అని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, భవిష్యత్తులో ప్రపంచ డేటా సెంటర్లన్నీ భారత్‌కే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రస్తుతం హార్టికల్చర్, ఆక్వాకల్చర్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, గ్రీన్, సోలార్ ఎనర్జీని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 

గతంలో తాము ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, ఇకపై రాష్ట్రాన్ని వేగంగా ప్రగతి పథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు.

Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
AP Development
ISB
Hyderabad
Gachibowli
Vishakhapatnam
Google Data Center

More Telugu News