ఇక్కడో అద్భుతం జరిగింది... ఎవరూ చనిపోలేదు: నెతన్యాహు

  • ఇరాన్ మిస్సైల్ దాడి జరిగిన అరాడ్ నగరాన్ని సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
  • ప్రాణనష్టం జరగకపోవడం అద్భుతమేనని వ్యాఖ్య
  • ఇరాన్ ప్రపంచ భద్రతకే ముప్పు అని తీవ్ర హెచ్చరిక
  • యూరప్‌పై దాడి చేసే సామర్థ్యం కూడా ఇరాన్‌కు ఉందని వెల్లడి
  • ఇరాన్‌పై కఠిన చర్యలకు ప్రపంచ దేశాలకు పిలుపు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్‌లోని అరాడ్ నగరాన్ని సందర్శించారు. ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ పడిపోయిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. "నేను ఇక్కడ అరాడ్‌లో ఉన్నాను. ఇక్కడో అద్భుతం జరిగింది, ఎవరూ చనిపోలేదు. కానీ మనం కేవలం అద్భుతాలపై ఆధారపడదల్చుకోలేదు. ఈ పోరాటంలో మనమే గెలుస్తున్నాం, శత్రువును అణిచివేస్తున్నాం" అని నెతన్యాహు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 48 గంటల్లో జరిగిన ఘటనలు ఇరాన్ ప్రపంచ భద్రతకు ఎంత ప్రమాదకరమో నిరూపిస్తున్నాయని హెచ్చరించారు. అరాడ్, డిమోనా నగరాల్లోని పౌర ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసిందని, ఈ దాడుల్లో సుమారు 200 మంది గాయపడ్డారని తెలిపారు. అరాడ్‌లో రెండు భవనాల మధ్య క్షిపణి పడినా ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టమని, కానీ పౌరులను చంపడమే ఇరాన్ ఉద్దేశమని ఆయన ఆరోపించారు.

ఇటీవల ఇరాన్ ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎమ్) హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియా సైనిక స్థావరంపై పడిందని, అది 4,000 కిలోమీటర్లు ప్రయాణించిందని నెతన్యాహు పేర్కొన్నారు. "ఇరాన్ ఇప్పుడు యూరప్ లోతుల్లోకి కూడా చేరగల సామర్థ్యం కలిగి ఉంది. వారు అందరినీ తమ పరిధిలోకి తెచ్చుకున్నారు" అని ఆయన హెచ్చరించారు.

అంతర్జాతీయ సముద్ర మార్గాలను, ఇంధన సరఫరా వ్యవస్థలను బెదిరిస్తూ ఇరాన్ ప్రపంచాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తోందని నెతన్యాహు విమర్శించారు. ఇజ్రాయెల్, అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాము ఇరాన్ పౌరులను కాకుండా, ఆ దేశ పాలనాయంత్రాంగం, వారి స్థావరాలు, ఆర్థిక వనరులనే లక్ష్యంగా చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనలతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.

Benjamin Netanyahu
Israel
Iran
Arad
Dimona
Missile attack
Middle East conflict
ICBM
Diego Garcia
Israel Iran tensions

More Telugu News