మా అబ్బాయికి స్టెంట్ వేశారు.. డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?: ఎంపీ పుట్టా మహేశ్ తండ్రి సుధాకర్

  • మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
  • తన కుమారుడు ఎంపీ మహేశ్ యాదవ్ నిరపరాధి అని వెల్లడి
  • ఎంపీకి గుండె సమస్య ఉందని, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టీకరణ
  • ఎయిమ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపిన ఎమ్మెల్యే
  • టీడీపీ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చామన్న పుట్టా సుధాకర్
తెలంగాణలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు ఎలాంటి సంబంధం లేదని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. తన కుమారుడు పూర్తి నిరపరాధి అని, అతడికి మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు లేదని ఆయన గట్టిగా చెప్పారు. ఈ ఆరోపణలపై కడపలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి తన కుమారుడు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే డ్రగ్స్ తీసుకోలేదని సుధాకర్ యాదవ్ తెలిపారు. "నా కుమారుడికి గుండె సంబంధిత సమస్య ఉంది. వైద్యులు స్టెంట్ కూడా వేశారు. అలాంటి వ్యక్తి డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?" అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు రక్త నమూనాలు తీసుకోకుండానే పాజిటివ్ అని ఎలా చెబుతారని నిలదీశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రక్త పరీక్షలు చేయించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన వెల్లడించారు.

ఈ ఘటనపై టీడీపీ అధిష్ఠానానికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించామని పుట్టా సుధాకర్ తెలిపారు. విచారణ పూర్తయితే అన్ని నిజాలు బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేయగా, కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ పార్టీలో ఎంపీ మహేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మహేశ్ యాదవ్ పేరు వినిపించడంతో టీడీపీ అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 



Putta Mahesh
Moinabad farmhouse
Drugs case
Putta Sudhakar Yadav
Telangana
TDP
Pilot Rohit Reddy
Drug test
AIIMS Delhi
Heart Stent

More Telugu News