ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా ఇస్తున్నారు: హరీశ్ రావు ఆగ్రహం

  • బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు
  • ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న హరీశ్ రావు
  • తొలి బడ్జెట్‌లో ప్రకటించి, ఆ తర్వాత రూ.12 వేలకు తగ్గించారని ఆరోపణ
  • బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శ
ఏవైనా ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా, పంటల బోనస్ ఇస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన శాసనసభలో మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని అన్నారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్‌లో ప్రకటించి, తర్వాత దానిని రూ.12 వేలకు తగ్గించారని విమర్శించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూడో పంటకు రైతుబంధు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఒక్క సీజన్‌కే ఇస్తున్నారని ఆరోపించారు. ఒక సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. మొదటి బడ్జెట్‌లో పెట్టినట్లు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.

గత రెండు బడ్జెట్‌లలో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్‌లో మాయమైందని అన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, రెండు బడ్జెట్‌లలో పెట్టారని గుర్తు చేశారు. కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్‌ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పి గత బడ్జెట్‌లో చెప్పి ఈసారి ఆ ప్రస్తావన కూడా తేలేదని విమర్శించారు.

Harish Rao
Rythu Bharosa
Telangana
BRS
Revanth Reddy
Crop Bonus
Farmers Welfare
Telangana Budget

More Telugu News