మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026... రూల్స్ కట్టుదిట్టం చేసిన బీసీసీఐ!

  • ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ కఠిన నిబంధనలు జారీ
  • మ్యాచ్ జరిగే రోజు ప్రాక్టీస్‌పై పూర్తిస్థాయి నిషేధం
  • ఆటగాళ్ల ప్రయాణాలు, సహాయక సిబ్బందిపై కఠిన ఆంక్షలు
  • పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌లో డ్రెస్ కోడ్ తప్పనిసరి
  • ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లు తప్పక క్యాప్ ధరించాలన్న బోర్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ను మరింత కట్టుదిట్టమైన నిబంధనల మధ్య నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. టోర్నమెంట్ సమయంలో జట్ల ప్రవర్తన, లాజిస్టిక్స్, క్రమశిక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) మధ్య జరగనున్న ఆరంభ మ్యాచ్‌కు ముందే ఈ కొత్త నియమావళిని ఫ్రాంచైజీలకు పంపారు.

మంగళవారం నాడు ఫ్రాంచైజీలకు పంపిన ఈ కొత్త రూల్స్‌లో కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా, మ్యాచ్ జరిగే రోజు జట్లు ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది. కేటాయించిన నెట్స్‌లో, నిర్దిష్ట సమయంలో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఫిట్‌నెస్ డ్రిల్స్ లేదా టెస్టులపై కూడా నిషేధం విధించారు. ప్రాక్టీస్ ఏరియాల్లోకి ఆటగాళ్లు, అనుమతి ఉన్న సిబ్బందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు హాస్పిటాలిటీ జోన్లకే పరిమితం కావాలి.

ఆటగాళ్ల కదలికలపైనా బీసీసీఐ ఆంక్షలు విధించింది. ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లు కచ్చితంగా టీమ్ బస్సులోనే ప్రయాణించాలి. వారి వెంట కుటుంబ సభ్యులకు అనుమతి లేదు. నెట్ బౌలర్లు, త్రోడౌన్ స్పెషలిస్టుల వివరాలను కూడా ఫ్రాంచైజీలు ముందుగానే బోర్డుకు సమర్పించి అనుమతి తీసుకోవాలి. మ్యాచ్ రోజుల్లో సహాయక సిబ్బంది అందరూ తమ అక్రిడిటేషన్ కార్డులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్చరికలతో పాటు జరిమానాలు కూడా విధిస్తారు.

ఇక బ్రాడ్‌కాస్ట్, ప్రజెంటేషన్ ప్రమాణాలపైనా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్లు మ్యాచ్ రోజుల్లో తప్పనిసరిగా ఆ క్యాప్‌లను ధరించాలి. పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో ఆటగాళ్లు స్లీవ్‌లెస్ జెర్సీలు, ఫ్లాపీ టోపీలు ధరించరాదని, కఠినమైన డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. ప్రాక్టీస్ సమయంలో ఎల్ఈడీ అడ్వర్టైజింగ్ బోర్డులను బంతితో కొట్టడం, వాటి ముందు కూర్చోవడం కూడా నిషిద్ధం.

BCCI
IPL 2026
Indian Premier League
BCCI rules
IPL rules
cricket
Royal Challengers Bangalore
Sunrisers Hyderabad
IPL guidelines
cricket rules

More Telugu News