ఆర్డీటీకి తొలగిన ప్రధాన అడ్డంకి... మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్

  • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ 
  • ఆర్డీటీకి విదేశీ నిధుల స్వీకరణకు మార్గం సుగమం
  • కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
  • మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్డీటీ నిర్వాహకుడు ఫెర్రర్
  • గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నారా లోకేశ్
తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. విదేశీ విరాళాల స్వీకరణపై ఉన్న నిబంధనలను సడలించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాంచో ఫెర్రర్ మాట్లాడుతూ, ఇది కేవలం ఆర్డీటీ సంస్థ తరఫున చెబుతున్న ధన్యవాదాలు కాదని, లక్షలాది మంది పేద ప్రజలు అందిస్తున్న ఆశీస్సులని అభివర్ణించారు. దీనికి లోకేశ్ బదులిస్తూ.. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఆర్డీటీ దశాబ్దాలుగా అందిస్తున్న సేవలతో పోలిస్తే తాను చేసిన సహాయం చాలా చిన్నదని వినమ్రంగా వ్యాఖ్యానించారు.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద కేంద్ర ప్రభుత్వం గతంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి అండగా నిలుస్తున్న ఆర్డీటీకి కూడా విదేశీ నిధుల ప్రవాహం నిలిచిపోయింది. దీంతో సంస్థ కార్యకలాపాలు కొనసాగించడం కష్టతరంగా మారింది.

ఈ సమస్యను ఆర్డీటీ నిర్వాహకులు గతంలోనే మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో, "లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. సంస్థ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తాం" అని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆయన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సంప్రదింపులు జరిపి ఈ సున్నితమైన సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

మంత్రి లోకేశ్ చొరవతో ఆర్డీటీకి విదేశీ నిధులు స్వీకరించేందుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడినట్లు సమాచారం. దీంతో అన్నార్తులు, నిరుపేద విద్యార్థులు, రోగులకు ఆర్డీటీ అందిస్తున్న సేవలు ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగనున్నాయి.

Nara Lokesh
RDT
Rural Development Trust
Mancho Ferrer
FCRA
Foreign Funding
Andhra Pradesh
Telugu States
Charity
NGO

More Telugu News