తెలంగాణలో పెట్రోలియం నిల్వలు అయిపోయాయనే వార్తలపై బండి సంజయ్ స్పందన

  • ఇంధన నిల్వలు అయిపోయాయనే వార్తల్లో నిజం లేదన్న బండి సంజయ్
  • ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ ఉందని వెల్లడి
  • జనాలు ఫుల్ ట్యాంక్ కోసం క్యూ కట్టడం వల్లే తాత్కాలికంగా స్టాక్ అయిపోయిందన్న సంజయ్

గత కొన్ని రోజులుగా తెలంగాణను కుదిపేస్తున్న "పెట్రోల్ కొరత" వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో, ముఖ్యంగా తెలంగాణలో ఇంధన నిల్వలు అయిపోయాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. 


ఇండియన్ ఆయిల్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భారత్ పెట్రోలియం (BPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని, కేంద్ర ప్రభుత్వం నిరంతరం దీనిని పర్యవేక్షిస్తోందని బండి సంజయ్ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి అందరూ ఒక్కసారిగా బంకుల వద్దకు 'ఫుల్ ట్యాంక్' కోసం క్యూ కట్టడం వల్లే తాత్కాలికంగా స్టాక్ అయిపోతోందని, ఇది 'కృత్రిమ కొరత' మాత్రమేనని ఆయన విశ్లేషించారు. 


ఇదే అదనుగా భావించి పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుందని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండబోదని భరోసా ఇచ్చారు.

Bandi Sanjay
Telangana
Petroleum reserves
Fuel shortage
IOCL
HPCL
BPCL
Indian Oil
Hindustan Petroleum
Bharat Petroleum

More Telugu News