రామతీర్థం భక్తులకు శుభవార్త.. గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కల్యాణ్
  • రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
  • ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పవన్ కల్యాణ్
  • రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయనగరం జిల్లా రామతీర్థంలో భక్తుల కోసం నిర్మించిన గిరిప్రదక్షిణ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  నిన్న అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.3.40 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) నిధులతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. శ్రీరామనవమికి ముందే భక్తులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర ఈ బీటీ రోడ్డును నిర్మించారు. గతంలో ఈ మార్గం రాళ్లు, ముళ్లతో నిండి ఉండటంతో భక్తులు గిరిప్రదక్షిణ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. స్థానికులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించి, రహదారి నిర్మాణాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత 20 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వివరించారు. ఇప్పటికే శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చామని, కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గానికి కూడా రోడ్డు మంజూరు చేశామని ఆయన గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు.
 
 

Pawan Kalyan
Ramatheertham
Vizianagaram
Giri Pradakshina
Temple Development
Hindu Dharma
Andhra Pradesh Temples
NREGS Funds
Lokesh Madhavi
Sri Rama Navami

More Telugu News