వైట్‌హౌస్‌లో రెడ్ కార్పెట్‌పై రోబోతో నడిచిన మెలానియా.. ప్రత్యేక అతిథిగా హ్యూమనాయిడ్!

  • వైట్‌హౌస్‌లో హ్యూమనాయిడ్ రోబోతో కనిపించి ఆశ్చర్యపరిచిన మెలానియా ట్రంప్
  • సదస్సులో 11 భాషల్లో అతిథులకు స్వాగతం పలికిన 'ఫిగర్ 03' రోబో
  • భవిష్యత్తులో విద్యార్థులకు రోబోలే పాఠాలు చెబుతాయని వ్యాఖ్యానించిన మెలానియా
  • పిల్లల ఎదుగుదలకు టెక్నాలజీని ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు పిలుపు
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వైట్‌హౌస్‌లో ఓ ప్రత్యేక అతిథితో కనిపించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఓ మనిషిలా కనపడే హ్యూమనాయిడ్ రోబోతో కలిసి ఆమె రెడ్ కార్పెట్‌పై నడవటం ఆసక్తి రేకెత్తించింది. "ఫొస్టరింగ్ ది ఫ్యూచర్ టుగెదర్ గ్లోబల్ కొయలిషన్ సమ్మిట్" రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. అమెరికాలోనే తయారైన 'ఫిగర్ 03' అనే ఈ రోబోతో కలిసి మెలానియా 40కి పైగా దేశాల ప్రతినిధులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఫిగర్ 03 రోబో.. "టెక్నాలజీ, విద్యతో పిల్లలను శక్తిమంతం చేసే ఈ చారిత్రక ఉద్యమంలో భాగమైనందుకు గర్వంగా ఉంది" అని చెబుతూ ఏకంగా 11 భాషల్లో అతిథులను పలకరించి ఆశ్చర్యపరిచింది. దీనికి మెలానియా స్పందిస్తూ.. "వైట్‌హౌస్‌లో నా మొదటి అమెరికన్-మేడ్ హ్యూమనాయిడ్ అతిథి మీరే" అని సరదాగా వ్యాఖ్యానించారు.

అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మెలానియా, మారుతున్న డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు విద్య, ఎదుగుదల, అభివృద్ధికి అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. భవిష్యత్తులో హ్యూమనాయిడ్ టీచర్లు విద్యార్థుల అభ్యాస వేగం, వారి మానసిక స్థితిని బట్టి లెక్కలు, ఇతర సబ్జెక్టులను బోధించగలవని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీకి చెందిన 'ఫిగర్ ఏఐ' అనే సంస్థ ఈ ఫిగర్ 03 రోబోను అభివృద్ధి చేసింది. ఇది 'హెలిక్స్' అనే ఏఐ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీని ఖరీదు సుమారు 25,000 డాలర్లు.

"ఓపెన్ఏఐ, పాలంటిర్, ఎక్స్ఏఐ వంటి ఏఐ మార్గదర్శకులతో పాటు గూగుల్, మెటా, అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు, జూమ్ వంటి కనెక్టివిటీ వేదికలు ఒకేచోట చేరడం అద్భుతం. ఈ గది మేధోసంపత్తితో నిండి ఉంది. ప్రపంచ నాయకులు ఈ టెక్నాలజీని ఉపయోగించి మీ పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చాలి, మీ ప్రజలను శక్తిమంతం చేయాలి, మీ ఆర్థిక వ్యవస్థలను వేగవంతం చేయాలి" అని మెలానియా పిలుపునిచ్చారు.

Melania Trump
White House
Figure 03
Humanoid robot
AI
Artificial intelligence
Technology
Education
Global Coalition Summit
Silicon Valley

More Telugu News