పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఆర్జీ కర్ మృతురాలి తల్లి పోటీ

  • 19 మంది అభ్యర్థులతో మూడవ జాబితా విడుదల చేసిన బీజేపీ
  • పానీహటి నియోజకవర్గం నుంచి తల్లి పోటీ
  • తనను గెలిపిస్తే పానిహటీ ప్రజలు గెలిచినట్లేనన్న తల్లి
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ 19 మంది అభ్యర్థులతో మూడవ జాబితాను విడుదల చేసింది. 2024లో కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లికి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఆమెను పానీహటి అసెంబ్లీ నియోజవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపుతోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. తాను గెలిస్తే పానిహటీ ప్రజలు గెలిచినట్లేనని ఆమె అన్నారు. నిరసనలు తెలపడం మరిచిపోయినవారి కోసం తాను గొంతుకనవుతానని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం గర్వకారణం కాదని, అది ఒక బాధ్యత అన్నారు.

తాను ప్రజలకు సేవచేయగలిగితే తన కూతురు సంతోషిస్తుందని అన్నారు. పశ్చిమబెంగాల్ అంతటా కమలం వికసించాలని ఆకాంక్షించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

2024 ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న 31 సంవత్సరాల పీజీ విద్యార్థినిపై హత్యాచారం జరిగింది. ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బెంగాల్‌లో నెలకు పైగా వైద్యుల నిరసనలు కొనసాగాయి. హత్యాచారం కేసు దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. ఇటీవలే వారు బీజేపీలో చేరారు.

ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బీజేపీ నుంచి పోటీ చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రజాస్వామ్య హక్కు ఆమెకు ఉందని పార్టీ సీనియర్ నేత కునాల్ ఘోష్ అన్నారు. తన కుమార్తె కేసును సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపించిన ఆమె, ఆ తర్వాత బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని ప్రశ్నించారు. 

కాగా, పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్లు లెక్కింపు జరగనుంది.

RG Kar Trainee Doctor Mother
West Bengal Assembly Elections
BJP Candidate
Panihati Constituency

More Telugu News