అసెంబ్లీని నడపలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడాపోటీల ఎత్తుగడ వేసింది: కేటీఆర్

  • ఈ నెల 28, 29 తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
  • కీలక పద్దులపై చర్చలు కొనసాగుతుండగా ఆటలపోటీలు ఎందుకని కేటీఆర్ ప్రశ్న
  • ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని విమర్శ
ప్రభుత్వం సభను నడపలేక క్రీడా పోటీల ఎత్తుగడ వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడుతూ, సభలో కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకు ప్రభుత్వం ఆటల పోటీలకు తెరతీస్తోందని విమర్శించారు. ఇరిగేషన్ వంటి కీలక పద్దులపై చర్చలు కొనసాగుతుండగా ఆటల పోటీలు ఎందుకని ప్రశ్నించారు.

ఇదే అంశాన్ని తాను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లానని, కానీ ఆయన వద్ద సమాధానం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రజాసమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ప్రజాప్రతినిధులు మైదానాలలో ఆటలు ఆడుతుంటే ప్రజలు ఏమనుకుంటారని ప్రశ్నించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ప్రభుత్వం క్రీడాపోటీలను నిర్వహించాలని నిర్ణయించిందని, కీలక అంశాలపై చర్చ సమయంలో ఇది సరికాదని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ సమావేశాలను ఆటలపోటీల వంటి కార్యక్రమాల పేరుతో వృథా చేయడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. పద్దులపై చర్చకు సమయం కేటాయించకుండా సభా సమయాన్ని క్రీడలకు కేటాయించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

KTR
K Taraka Rama Rao
Telangana Assembly
Revanth Reddy
BRS Party
Telangana Politics
Assembly Sessions

More Telugu News