జగన్ పీఏ కేఎన్ఆర్ నివాసంలో సిట్ తనిఖీలు

Jagan PA KNageswaraReddy Questioned by SIT on Illegal Assets
  • మద్యం కుంభకోణంలో జగన్ పీఏ కేఎన్ఆర్ ఇంట్లో సిట్ సోదాలు
  • విజయవాడలోని నివాసంలో తనిఖీలు, సిట్ ఆఫీసులో కొనసాగుతున్న విచారణ
  • కేఎన్ఆర్ భార్య పేరిట భారీగా ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తింపు
  • నిన్న 9.5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. నేడూ కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం తనిఖీలు చేపట్టింది. మద్యం లావాదేవీలకు సంబంధించి విజయవాడలోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు, సిట్ కార్యాలయంలో కేఎన్ఆర్‌ను అధికారులు విచారిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఆయనను ప్రశ్నిస్తున్నారు. బుధవారం కూడా కేఎన్ఆర్‌ను సిట్ అధికారులు దాదాపు 9.5 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం.

సిట్ దర్యాప్తులో కేఎన్ఆర్ ఆస్తులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన భార్య శశికళ పేరిట తిరుపతి జిల్లాలో 10 ఎకరాల భూమి ఉన్నట్లు, ఆమె బ్యాంకు ఖాతాలో 2019-24 మధ్య సుమారు రూ. 19.86 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. వీటికి తోడు విజయవాడలో ఒక కార్ షోరూంలో వాటా, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులో ఫ్లాట్లు, పలు జిల్లాల్లో ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కేఎన్ఆర్, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనూహ్యంగా ఆస్తులు కూడబెట్టిన కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు నివాసంలో సోదాలు జరగడం ఈ కేసులో తీవ్రతను తెలియజేస్తోంది.
Go Back to Shorts
KNageswaraReddy
Andhra Pradesh liquor scam
Jagan Mohan Reddy PA
AP liquor case
Special Investigation Team
SIT investigation
Sasikala KNageswaraReddy
illegal assets
Vijayawada
Tirupati

More Telugu News