నా అస‌లు టార్గెట్ వేరే... నా నుంచి మీరు త‌ర్వాత‌ చూసేది ఆ క్రికెటే: వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi Says His Target is Playing Test Cricket for India
  • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీ
  • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ సహా పలు అవార్డుల కైవసం
  • టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడటానికి కోచ్‌లు స్వేచ్ఛనిచ్చారని వెల్లడి
  • తన అసలు లక్ష్యం టెస్ట్ క్రికెట్ ఆడటమేనని స్పష్టం చేసిన యువ సంచలనం
  • ఇప్పటికే రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టానని తెలిపిన వైభవ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫయర్ 2లోనే వెనుదిరిగినప్పటికీ, ఆ జట్టులోని ఓ యువ సంచలనం మాత్రం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగుల రికార్డు స్కోరుతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఇంతటి విజయం సాధించినా, తన అసలు లక్ష్యం భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమేనని ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో వైభవ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. "అవును, నా తర్వాతి టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉంది. దానికోసం నేను గ్రౌండ్‌లో కష్టపడాలి. నేను రెడ్ బాల్‌తో చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. త్వరలోనే అందరూ చూస్తారు" అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.

తన దూకుడైన బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. "ప్రతి బంతిని బాదడమంటే నాకు ఇష్టమని అందరూ అనుకుంటారు. కానీ, ఇది టీ20 ఫార్మాట్. స్వేచ్ఛగా ఆడమని కోచ్‌లు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. బంతిని నేను బాదగలనని నమ్మకం ఉన్నప్పుడే షాట్ ఆడతాను. అంతేగానీ, బలవంతంగా ప్రతి బంతినీ కొట్టాలని చూడను" అని తెలిపాడు.

అంతేగాక‌ "టెస్ట్ క్రికెట్టే అసలైన ఫార్మాట్ అని మా నాన్న నాకు నేర్పించారు. అందుకే నేను కచ్చితంగా టెస్టులు ఆడాలనుకుంటున్నాను. గతంలో రంజీ ట్రోఫీ ఆడినప్పటికీ నాకు ఎక్కువ అవకాశాలు రాలేదు. అది నాకు సవాల్‌గా నిలిచింది. కానీ, నా ఆటలోని ఆ అంశంపై నేను కష్టపడుతూనే ఉంటాను" అని తన అంతిమ లక్ష్యాన్ని తెలియ‌జేశాడు.

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అవార్డుల పంట పండించాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డులను కూడా కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటాడు.
Go Back to Shorts
Vaibhav Sooryavanshi
Test Cricket
Team India
IPL 2026
Cricket
Sports News

More Telugu News