భారత పర్యాటకుల తీరు మారకపోతే కష్టమే.. విదేశాల్లో మనోళ్ల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్‌!

IPS Officer Arun Bothra Raises Concern Over Indians Conduct Abroad
  • విదేశాల్లో భారత పర్యాటకుల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఆందోళన
  • కొందరి అనుచిత ప్రవర్తన వల్ల అందరికీ వీసా నిబంధనలు కఠినం కావొచ్చని హెచ్చరిక
  • పాస్‌పోర్ట్ హక్కుతో పాటు బాధ్యత అని గుర్తుంచుకోవాలని సూచన
  • సోషల్ మీడియా రీల్స్ కోసం పబ్లిక్‌లో వింత చేష్టలు తగదని వ్యాఖ్య
  • అధికారి వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన
విదేశాల్లో కొందరు భారతీయ పర్యాటకుల అనుచిత ప్రవర్తన కారణంగా, భవిష్యత్తులో భారతీయులందరికీ వీసా నిబంధనలు కఠినతరం కావచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత పాస్‌పోర్ట్ కలిగి ఉండటం హక్కు మాత్రమే కాదని, అదొక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఒడిశాలో అదనపు డీజీపీ (సీఐడీ క్రైమ్), రవాణా కమిషనర్‌గా పనిచేస్తున్న అరుణ్ బోత్రా, విదేశాలకు వెళ్లే భారతీయులు అక్కడి స్థానిక చట్టాలను గౌరవించాలని, బహిరంగ ప్రదేశాల్లో హుందాగా ప్రవర్తించాలని, తద్వారా దేశ ప్రతిష్ఠను కాపాడాలని సూచించారు. దేశ గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీవ్రమైన సందర్భాల్లో వారి విదేశీ ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించడం గురించి కూడా ఆలోచించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

"మనలో కొందరి అసభ్య ప్రవర్తన గురించి విదేశీయులు ఏమనుకుంటున్నారనే దానికంటే, వారి ప్రవర్తన వల్ల భారతీయులందరికీ వీసా నిబంధనలు కఠినతరం అవుతుండటమే నన్ను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తోంది. థాయ్‌లాండ్ దీనికి తాజా ఉదాహరణ" అని ఒక యూజర్‌కు బదులిస్తూ బోత్రా పేర్కొన్నారు. సోషల్ మీడియా రీల్స్ కోసం విదేశాల్లోని సూపర్ మార్కెట్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో కొందరు భారతీయులు డ్యాన్సులు చేస్తూ వింతగా ప్రవర్తించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "ఆతిథ్య దేశాల్లోని ప్రజలు మనల్ని చూసి, మనలో ఎవరు అకస్మాత్తుగా రీల్ చేయడానికి డ్యాన్స్ చేస్తారోనని భయపడే పరిస్థితి రాకూడదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల వియత్నాం, అమెరికా వంటి దేశాల్లో భారత పర్యాటకులు బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో బోత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన పోస్టుపై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆయన వాదనను సమర్థిస్తూ, కొందరు భారత పర్యాటకుల వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. "ఒకప్పుడు భారత డ్రైవింగ్ లైసెన్సులను, విద్యార్హతలను పశ్చిమ దేశాలు నమ్మేవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు" అని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, మరికొందరు ఆయనతో విభేదించారు. "ఏ దేశం కూడా పౌరుల ప్రవర్తనను చూసి వీసాలు ఇవ్వదు. వారి బ్యాంకు బ్యాలెన్స్, ఉద్యోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది" అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. 
Go Back to Shorts
Arun Bothra
IPS Officer
Indians' Conduct Abroad

More Telugu News