టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే!

Sanjay Manjrekar advised against picking Vaibhav Sooryavanshi in foreign conditions straightaway
  • ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంపికపై చర్చ
  • వైభవ్‌ను అప్పుడే విదేశీ పర్యటనలకు పంపడం సరికాదన్న సంజయ్ మంజ్రేకర్
  • తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతడికే ఇవ్వాలని సూచన
  • వన్డేల్లో రోహిత్ శర్మ కన్నా మెరుగ్గా ఆడగల సత్తా వైభవ్‌కు ఉందని వ్యాఖ్య
  • రంజీ జట్టులో స్థానం కోసం ఇతర ఆటగాళ్లలాగే అతడూ పోరాడాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌
ఐపీఎల్ 2026లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి సంచలనం సృష్టించిన 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి తీసుకోవాలనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఇండియా-ఏ జట్టులో స్థానం దక్కించుకున్న వైభవ్‌ను, ఈ నెలాఖరులో జరిగే ఐర్లాండ్ పర్యటనకు సీనియర్ జట్టుకు ఎంపిక చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దని హితవు పలికాడు.

స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ప్రస్తుత ఆటగాళ్లలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తర్వాత వైభవ్ ఉంటాడు. అయితే, అతడిని భారత జట్టులోకి తీసుకుంటే, ఐపీఎల్‌లో ఉన్నటువంటి బ్యాటింగ్ పరిస్థితుల్లోనే ఆడిస్తే బాగుంటుంది. అప్పుడే అతడిని నేరుగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి కఠినమైన విదేశీ పిచ్‌లపైకి పంపడం సరైన ఆలోచన కాదు" అని మంజ్రేకర్ అన్నాడు. ఈ ప్రక్రియను సహజంగా జరగనివ్వాలని, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లతో పోటీ ఉన్నప్పుడు ఎంపిక కష్టతరమేనని పేర్కొన్నాడు.

వైభవ్ కెరీర్‌కు సంబంధించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతడికే ఇవ్వాలని మంజ్రేకర్ బలంగా వాదించాడు. "అతడిని మనం ఎలా నడిపించాలి, రెడ్-బాల్ క్రికెట్‌లో ఎలా రాణిస్తాడు అని చర్చించడం మన పని కాదు. బీసీసీఐ పని కూడా కాదు. అతడు తన భవిష్యత్తు గురించి తనే నిర్ణయించుకోవాలి. కేవలం టీ20 సంచలనంగానే ఉండాలనుకుంటే, అది అతని ఇష్టం. దానిని తప్పుబట్టలేం. వన్డేల్లో కూడా అతడు ఎంతో విలువైన ఆటగాడు. 2023 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చేసిన దానికంటే కూడా మెరుగ్గా తొలి 10 ఓవర్లలో ఆడగల సత్తా అతనికి ఉంది" అని విశ్లేషించాడు.

అదే సమయంలో రెడ్-బాల్ క్రికెట్ ఆడాలనుకుంటే, దానికోసం ప్రత్యేకంగా కష్టపడాలని మంజ్రేకర్ స్పష్టం చేశాడు. "ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అతడిని రంజీ జట్టులోకి తీసుకుంటే, ఏళ్ల తరబడి కష్టపడిన ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టవుతుంది. రెడ్-బాల్ క్రికెట్ ఆడాలని అతడు ఆశిస్తే, బీహార్ రంజీ జట్టులో స్థానం కోసం పోరాడాలి. సెలక్టర్లను మెప్పించి చోటు దక్కించుకోవాలి. అనవసరంగా విషయాలను సంక్లిష్టం చేయకుండా, అతడిని తన మార్గాన్ని తననే ఎంచుకోనివ్వాలి" అని మంజ్రేకర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.
Go Back to Shorts
Sanjay Manjrekar
Vaibhav Sooryavanshi
Team India
Cricket
Sports News
IPL 2026

More Telugu News