కేసీఆర్ హయాంలో నిరంకుశత్వం.. ఏపీకి మేము వ్యతిరేకం కాదు: కోదండరాం
- కేసీఆర్ హయాంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదని కోదండరాం మండిపాటు
- అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య
- ఏపీ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదన్న కోదండరాం
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరంకుశ వైఖరి నడిచిందని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కనీసం నిరసన వ్యక్తం చేసుకోవడానికి కూడా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య స్వేచ్ఛ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, రాష్ట్ర ఆకాంక్షలకు అడ్డుపడితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
అరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కోదండరాం ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాడు అప్పటి పాలకులతో ప్రాణాలకు తెగించి కొట్లాడి స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో నాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, అప్పటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ సాధనలో ప్రజలు ఏ విధంగా భాగస్వాములయ్యారో, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో కూడా ప్రజలంతా తమ వంతు సూచనలు, సలహాలు అందించాలని కోరారు. సమసమాజ స్థాపన కోసం సాగే పోరాటంలో కలిసివచ్చే ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తామని, కానీ తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత చాలా ప్రాముఖ్యమైనదని కోదండరాం వ్యాఖ్యానించారు. తాము ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకం కాదని, కేవలం తెలంగాణపై నాటి ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇక్కడ తలదూరుస్తూ రాజకీయాలు చేయాలని చూడటం సరికాదన్నారు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తప్పు కావొచ్చేమో కానీ, ఆయనకు ఉన్న సమాచారంతోనే ఆయన మాట్లాడారని.. దానికి సమాధానం చెప్పుకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలే తప్ప, దాన్నే అడ్డుపెట్టుకుని ఆంధ్ర నాయకులు ఇక్కడి భావప్రకటన స్వేచ్ఛను అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం అస్సలు ఒప్పుకోదని కోదండరాం హెచ్చరించారు.