తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయాలని చూస్తే ఊరుకోం.. మరో పోరాటానికి సిద్ధం కావాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy fires on AP leaders
  • రాష్ట్రంపై కొన్న శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్న వేముల
  • డిక్షనరీలో తెలంగాణ పదం లేదని టీటీడీపీ అధ్యక్షుడు అన్నారని మండిపాటు
  • ఈ వ్యాఖ్యలపై రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర సమాజం ఎంతో పోరాడి, ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని, ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 


2001లో కేసీఆర్ ఒంటిచేత్తో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి, అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో 14 ఏళ్ల పాటు అలుపెరుగని ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. నాడు కేసీఆర్ సృష్టించిన రాజకీయ అనివార్యత వల్లే కాంగ్రెస్, టీడీపీలు లొంగివచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారని కొనియాడారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుబంధును 'ఓట్లు ఉంటేనే' అన్న చందంగా మార్చిందని, రైతుబీమాను పక్కన పడేసిందని విమర్శించారు.


మరోవైపు, పొరుగు రాష్ట్ర నేతల తీరుపై వేముల తీవ్రంగా ధ్వజమెత్తారు. టీడీపీ మహానాడు సభలో టి.టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు మాట్లాడుతూ "డిక్షనరీలోనే తెలంగాణ పదం లేదు" అని మాట్లాడినా సీఎం రేవంత్ రెడ్డి కానీ, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కానీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం తెలంగాణపై వెటకారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలైన పులి కేసీఆర్ ఇవాళ అధికారంలో లేకపోవడం వల్లే వీరంతా ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 


గతంలో మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ నైజం వల్లే వేలాది మంది బిడ్డలు బలి అయ్యారని, నాటి రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ‘బలిదేవత’ అని విమర్శించి.. ఇవాళ మాయమాటలు చెబుతున్నారని ఎండగట్టారు. ప్రధాని మోదీ సైతం పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టారని గుర్తుచేశారు. మోదీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ ఒకటై తెలంగాణ ఉనికిని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న వేళ, ఈ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Go Back to Shorts
Vemula Prashanth Reddy
BRS
TDP

More Telugu News