ఆ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు తప్పు... నేను ఖండించడంతో ఈ వివాదం మొదలైంది: పవన్

Pawan Klayan speaks about Prof Nageswar comments
  • ఓ విశ్లేషకుడు అమిత్ షాతో తన భేటీపై తప్పుగా మాట్లాడటంతో వివాదం మొదలైందన్న పవన్
  • తనకు తెలంగాణ ప్రజలంటే గౌరవం అని వెల్లడి
  • పాలకులను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నాని స్పష్టీకరణ
  • పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యులను చేయొద్దని హితవు 
ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య కొందరు కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇది దేశ సమగ్రతకే ప్రమాదమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యుల్ని చేయడం సరికాదని, తాను ఎప్పుడూ తెలంగాణ ప్రజలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల విషయంలో ఇటీవల తనపై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల తీవ్రంగా స్పందించారు.

"అసలు ఈ గొడవ ఎందుకు, ఎక్కడ మొదలైందంటే... నేను గౌరవించే ఓ రాజకీయ విశ్లేషకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో నా భేటీ గురించి మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు చేశారు. నేను, అమిత్ షా గారు మాట్లాడుకున్న విషయాలు ఆయన విన్నట్టుగా అబద్ధాలు చెప్పారు. దానిని నేను ఖండించడంతోనే ఈ వివాదం మొదలైంది.

నేను వాస్తవాలు చెప్పగానే నాపై తిట్ల దండకం మొదలుపెట్టారు. దానికి ప్రతిగా మా జనసైనికులు కొన్ని కేసులు పెట్టారని తెలిసింది. కానీ, వాటన్నింటినీ వదిలేయమని నేను స్పష్టంగా చెప్పాను. అయినా ప్రెస్‌క్లబ్‌లో మళ్లీ నన్ను తిడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా మీద తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేయాలని చూస్తున్నారు.

తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లయినా, ఇప్పటికీ ఉపాధి లేకపోయినా, పరిశ్రమలు రాకపోయినా దానికి ఆంధ్రులే కారణమంటూ నిందించడం ఎంతవరకు సబబు? ప్రతిదానికీ పవన్ కల్యాణే కారణమని, ఆంధ్రులే కారణమని అంటే ఇక్కడికి పెట్టుబడులు ఎలా వస్తాయి? ప్రజలు ఎలా వస్తారు? తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలి.

ఒకప్పుడు మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమను, నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఎంతో ముందుచూపుతో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 50 ఏళ్లు కలిసి ఉన్న రాజధాని ఇది. అలాంటిది ఇప్పుడు కొంతమంది నాయకులు ఇక్కడికి రాకూడదంటున్నారు. నేను మొదటి నుంచీ చెబుతున్నాను... ప్రజలు వేరు, పాలకులు వేరు. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను శిక్షించండి, అందులో పవన్ కల్యాణ్ ఉన్నా ఊరి తీయండి. అంతేగానీ, పాలకుల కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దు.

ఈ ప్రాంతీయ ద్వేషం దేశానికి మంచిది కాదు. రేపు సూరత్‌లో తెలుగువారిని ఉండొద్దని గుజరాతీలు, నాందేడ్‌లో మన వారిని ఉండొద్దని మహారాష్ట్రీయులు అంటే దేశం నిలబడుతుందా? మనమంతా భారతీయులం అనే విషయాన్ని మర్చిపోవద్దు. తెలంగాణ కూడా భారత్ లో అంతర్భాగమే" అని పవన్ స్పష్టం చేశారు.

Go Back to Shorts
Pawan Kalyan
Prof Nageswar
Telangana
Janasena
Hyderabad
BJP
Congress
BRS

More Telugu News