'కదిలే దీవి'... చైనా ప్లాన్ మామూలుగా లేదు!

China building the world largest naval support ship
  • చైనా సంచలన ప్రతిపాదన.. సముద్రంలో తేలియాడే అణు ద్వీపం
  • షిప్పింగ్ రంగంలో కర్బన రహిత లక్ష్యమే ప్రధాన ఉద్దేశం
  • తేలియాడే టెర్మినల్‌గా, చార్జింగ్ హబ్‌గా పనిచేయనున్న నిర్మాణం
  • అత్యంత సురక్షితమైన మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లతో విద్యుదుత్పత్తి
  • గ్రీస్‌లో జరిగిన ప్రదర్శనలో డిజైన్‌ను ఆవిష్కరించిన చైనా షిప్‌యార్డ్
అంతర్జాతీయ సముద్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే లక్ష్యంతో చైనా ఒక భారీ ప్రాజెక్టును సిద్ధం చేసింది. అణుశక్తితో పనిచేసే భారీ తేలియాడే ద్వీపాన్ని (ఫ్లోటింగ్ ఐలాండ్) నిర్మాణానికి ప్రతిపాదించింది. దీనిని కార్బన్ రహిత కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్‌గా, అలాగే ఛార్జింగ్ హబ్‌గా వినియోగించనున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో జరుగుతున్న 'పొసిడోనియా' అంతర్జాతీయ షిప్పింగ్ ఎగ్జిబిషన్‌లో చైనా ప్రభుత్వ రంగ సంస్థ 'జియాంగ్నాన్ షిప్‌యార్డ్' ఈ వినూత్న డిజైన్‌ను ప్రదర్శించింది.

ఈ తేలియాడే నిర్మాణం షిప్పింగ్, పోర్ట్ నిర్వహణ, ఇంధన ఉత్పత్తి వంటి కీలక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలవనుంది. దీనికి ప్రధానంగా అత్యాధునిక మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. ద్రవరూప ఉప్పును ఇంధనంగా, శీతలీకరణిగా ఉపయోగించే ఈ రియాక్టర్లు అత్యంత సురక్షితమైనవని షిప్‌యార్డ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ద్వీపంలో వీటితో పాటు సౌరశక్తి, పవన విద్యుత్, హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ నిర్మాణం ద్వారా సుదూర సముద్ర మార్గాల్లో సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. అలాగే ఎలక్ట్రిక్ నౌకలకు చార్జింగ్ సదుపాయంతో పాటు, అమ్మోనియా వంటి కర్బన రహిత ఇంధనాల ఉత్పత్తిని కూడా ఇక్కడే చేపట్టనున్నారు. షిప్పింగ్ పరిశ్రమ ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలని అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. గత సంవత్సరం కూడా ఇదే షిప్‌యార్డ్ థోరియం ఆధారిత అణు కంటైనర్ షిప్ నమూనాను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ భారీ ప్రాజెక్టు రూపకల్పన దశలోనే ఉంది. దీని నిర్మాణం లేదా అమలుకు సంబంధించి చైనా ఎటువంటి కాలపరిమితిని ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, సుస్థిర సముద్ర రవాణా సాంకేతికతలో చైనా తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.
Go Back to Shorts
China building the world largest naval support ship
world largest naval support ship

More Telugu News