కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

Heavy rains lash Kerala IMD issues warning
  • కేరళలో తీవ్రరూపం దాల్చిన నైరుతి రుతుపవనాలు
  • ఐదు ఉత్తర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ
  • శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
  • పలుచోట్ల ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు
  • కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
జూన్ 4న కేరళను పలకరించిన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ సీజన్‌లో తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళ ఉత్తర భాగంలోని ఐదు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

శుక్రవారం ఉదయం కోజికోడ్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలుల ధాటికి చెట్లు నేలకూలాయి. శనివారం మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గడ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మరికొన్ని జిల్లాలకు ఆదివారం కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరోవైపు ఇడుక్కి, త్రిస్సూర్, ఎర్నాకుళం, కొట్టాయం, పాలక్కాడ్, పతనంతిట్ట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలప్పుజ, కొల్లం, తిరువనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సాధారణ తేదీ కంటే ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి తీవ్రత అధికంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా సహాయక శిబిరాలకు తరలివెళ్లాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పర్యాటక ప్రాంతాలు, నదులు, కొండ ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది. 

అత్యవసర సహాయం కోసం 1077, 1070 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని కోరింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని సమాచారం.
Go Back to Shorts
Kerala
IMD
Southwest Monsoon
Red Alert
Heavy Rainfall
Kerala Weather Update
Kozhikode

More Telugu News