ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తండ్రి కస్తూరి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు!
- రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంటుందన్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా
- తన మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని వ్యాఖ్య
- ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు అని వెల్లడి
కోలీవుడ్ స్టార్ ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా?... ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ తర్వాత ఇప్పుడు ధనుష్ గురించి కూడా ఇలాంటి చర్చలే సాగుతున్నాయా? అంటే.. అవుననేలా ధనుష్ తండ్రి, ప్రముఖ సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా చేసిన తాజా వ్యాఖ్యలు సరికొత్త ఊహాగానాలకు తెరలేపాయి. చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజాను.. ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై మీడియా ప్రశ్నించగా, ఆయన ఆ అవకాశాన్ని కొట్టిపారేయకుండా చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుందని, భవిష్యత్తులో తన కుమారులే కాదు, తన మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని కస్తూరి రాజా వ్యాఖ్యానించారు. ఈ ఓపెన్ స్టేట్‌మెంట్‌తో ధనుష్ భవిష్యత్తులో ఎప్పుడైనా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ధనుష్ అసలు పేరు ‘వెంకటేష్ ప్రభు’ అని, ఆ తర్వాతే సినిమాలో ఆ పేరు మార్చుకున్నాడని చెప్పారు. ఎయిర్‌పోర్టుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో తన కొడుకును ‘ధనుష్ కె. రాజా’ అని పిలుస్తుంటే ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపిస్తుందని ఆయన పంచుకున్నారు.