నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కులేదు... ఇక తెలంగాణలో అవుతానా?: పవన్ కల్యాణ్

Pawan Kalyan on Chief Minister post
  • హైదరాబాదులో పవన్ ప్రెస్ మీట్
  • తాను రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడంలేదని స్పష్టీకరణ
  • కొందరు కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం
  • బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటన
"నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కు లేదు, ఇక తెలంగాణలో ఎందుకు అవుతాను?" అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే తాను ప్రయత్నిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ, తనను, జనసేనను లక్ష్యంగా చేసుకుని కొందరు పనిగట్టుకుని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ గారు ఆంధ్రాలో ప్రారంభించినప్పుడు, నేను మనస్ఫూర్తిగా స్వాగతించాను. ఒక రాజకీయ పార్టీని దేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టి, జనసేనలో పనిచేసిన నాయకుడిని అధ్యక్షుడిగా నియమించినా నేను ఆహ్వానించాను. అలాంటప్పుడు, జనసేన తెలంగాణలో అడుగుపెట్టకూడదు అనడం ఎంతవరకు సబబు? మేమేమైనా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని అడుగుతున్నామా? ఆంధ్రాలోనే దిక్కులేని నాకు అక్కడ ఆశ ఎందుకు ఉంటుంది?

నిజానికి వాళ్లకున్న భయమల్లా ఒక్కటే. జనసేన వస్తే ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుందనే భయం. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుందనే భయం. కేవలం 2000 మందితో సభ పెట్టుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వకపోతే మేం ఏం చేయాలి? దుర్మార్గాలు చేయమంటారా? నేను అమిత్ షా గారి గురించి మాట్లాడితే, దానికి ప్రాంతీయత, కులం రంగులు పులిమి నన్ను అవమానిస్తారా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే, కనీసం బాధపడే హక్కు కూడా మాకు లేదా? మేం ఇంకా "బాంచన్ దొర, నీ కాళ్లు మొక్కుతా" అని బతకాలా? పీకలు కోసుకుంటాం కానీ అలాంటి భయంతో బతకలేం.

తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లు బాగున్నారు. వాళ్ల వ్యాపారాలు, అధికారాలు అన్నీ బాగున్నాయి. మధ్యలో నాలాంటి వాడిని మాట్లాడనివ్వకుండా చేసి, ప్రజలను బేవకూఫ్‌లను చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజంగా నేను తెలంగాణకు రావొద్దని మీరు అనుకుంటే, అసెంబ్లీలో తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగుపెట్టకూడదని తీర్మానం చేయండి. ఎలా చేస్తారో నేను కూడా చూస్తా.

తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా యువత ప్రాణాలు అర్పించారు. వాళ్లంటే నాకు ఎంతో గౌరవం. తెలంగాణ అంటే నాకు ప్రాణం. కానీ మీరు నా ప్రేమనే శంకిస్తున్నారు. అందుకే, ఇప్పటిదాకా తీసుకోని నిర్ణయం ఇప్పుడు తీసుకుంటున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేం పోటీ చేస్తాం. నేనే స్వయంగా తిరుగుతా. ప్రతి సమస్యపై మాట్లాడుతాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని మర్చిపోకండి. బెదిరిస్తే భయపడటానికి మేం సిద్ధంగా లేము. దశాబ్దాలుగా భరించాం, ఇక చరమగీతం పాడతాం. విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే ఈరోజు అక్కడ పదవుల్లో కూర్చున్నారు" అని ఘాటుగా విమర్శించారు.

తెలంగాణ ఉద్యమం ఊపందుకోక ముందు నుంచే తనకు ఇక్కడి సంస్కృతి, పోరాట స్ఫూర్తి అంటే ఎంతో ఇష్టమని, దానిని తన సినిమాల్లోనూ చూపించానని గుర్తుచేశారు. కొందరు నాయకులు తనను భౌతికంగా అడ్డుకుంటామని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ హెచ్చరించారు. చావుకు సిద్ధపడే పార్టీ పెట్టానని అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు దేశ సమగ్రతకు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. "ఉపాధి లేకపోతే, పరిశ్రమలు రాకపోతే దానికి ఆంధ్రోళ్లే కారణం అన్నట్టు మాట్లాడటం సరికాదు. నాయకుల మధ్య ఉండే విభేదాలను ప్రజలకు అంటించవద్దు" అని హితవు పలికారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Press Meet
Janasena
Hyderabad
Telangana

More Telugu News